వైదికమత సంరక్షణ
ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకొని అనుష్ఠానమో, ప్రార్థనో, జపమో చేసుకోవటం మన పూర్వికులకు అలవాటు, ఇవన్నీ చేయకున్నా, ఇపుడు స్నానం చేసి సూర్యుణ్ణి చూసి ఒక నమస్కారం పెట్టి మిగతాకార్యాలు చూచుకొంటున్నాం. అన్యమతస్థులు ఆదివారం చర్చికి వెళ్ళుతున్నారు. ఇట్లా ఒక్కొక్క మతానికీ ఒక్కొక్క విధమైన ప్రార్థన నిర్ణీతమయ్యే ఉంది.
మనం సాధారణంగా లోకం అని వ్యవహరించేటపుడు అందులో ఒక్క మనుష్యులు మాత్రమే జీవిస్తున్నారని అనుకోడానికి లేదు. ఇంకా అనేకమైన సూక్ష్మజీవాలు కూడ ఉన్నాయి. మనదృష్టికి కనపడని జీవాలను మైక్రాస్కోపు ద్వారా చూస్తున్నాం. అదేవిధంగా సామాన్యదృష్టికి అందని భువర్లోక సువర్లోకాలూ, మండలాలూ ఉన్నాయి. వివిధములైన దేవతామూర్తులూ ఉన్నారు.
ఈ దేవతామూర్తులను ఉద్దేశించి మనం ప్రార్థనచేస్తే కొంతకాలానికి ఆ దేవత దర్శనం ఇస్తుంది. ఉపాసకునకూ, దేవతకూ ఈ దర్శనం అన్యోన్యంగా కల్గుతుంది. ఇది మన మతంలోనేకాదు, ఇతరమతాలకూ అన్వయించే సత్యం.
సాక్షాత్ ఈశ్వర ప్రసాదమని మనం నమ్ముతున్న ఆగమశిల్ప శాస్త్రంలో దేవతామూర్తి వివరణకూలంకషంగా ఇవ్వబడిఉన్నది. ఈ ఆగమ శాస్త్రాలను అనుసరించి స్థపతి రాతిలో రూపకల్పన చేసి మనకు మూర్తి దర్శనభాగ్యం కలిగిస్తున్నాడు. మనం ఈరోజుల్లో ఆఫీసుపనులూ ఇంటి పనులకే కాలమంతా వినియోగిస్తున్నాం. దేవాలయాలు, దేవతామూర్తులు, పురాణతిహాసాలూ, వీనిని గూర్చి పట్టించుకోకుండా ఉన్నాం. వీనిని జ్ఞాపకం చేయడానికే విద్యత్ సదస్సులను ఏర్పాటుచేశాం.
పూర్వం మనమతం వైదిక మతమని పిలువబడేది. ఆంగ్లేయులు వచ్చి మనలను హిందువులన్నారు. వారు ఆవిధంగా పిలిచినందువల్ల రక్షింపబడ్డాం. పరిపాలనాసౌలభ్యానికి దేశాన్ని వివిధరాష్ట్రాలుగా విభజించిన పిమ్మట, ఒక్కొక్క రాష్ట్రంలోని మతాన్ని ఒక్కొక్క మతంగా గణించిపుంటే, హిందువులనేవారే లేకపోయేవారు. మన దేశంలోఉన్న అన్ని మతాలకూ వేదమే మూలంకనుక, మనలను అందరినీ కలిపి హిందువులన్నారు. ఏవిధంగాచూచినా వేదమే మనలను రక్షించింది.
క్రైస్తవులలో ప్రొటెస్టెంట్, క్యాథలిక్కులని రెండు శాఖలు. ఇటీవల ఈరెండూ ఏకమై, యునైటెడ్ చర్చి అన్న ఉద్యమం ప్రారంభించారు. క్రైస్తవ మతవ్యాప్తి ఏవిధంగా జరిగిందో మనకు తెలుసు. ఇప్పటికీ వారు విశ్రమించటంలేదు. అన్యమత నిర్బంధానికి వాళ్ళు ఏకమవుతున్నపుడు స్వమత పరిరక్షణకైనా మనం ఏకంకావలసిన అవసరంలేదా? ఈ కారణంచేత పదిసంవత్సరాలుగా వివిధ మఠాధిపతులను ఒక చోట సమావేశపరచడానికి ప్రయత్నిస్తున్నా కొందరు సహకరించారు. కొందరు సహకరించలేదు.
హైందవ మతానికిచేరిన వారందరూ, మానవుని జన్మాంతరంలో నమ్మకమున్నవారు. పునర్జన్మలో విశ్వాసం కలిగిన వైదికమతావలంబకు లందరూ ఆ ఆ మతాలకు చెందిన అనుష్టానాలు చేయటం ఎంతైనా అవసరం. దీనికి పీఠాధిపతులు పూనుకోవాలి.
క్రైస్తవులు పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోరు. ఈజన్మేయథార్థమనీ, ఇందులో పుణ్యకార్యాలుచేస్తేమోక్షమనీ, పాపకార్యాలుచేస్తే నరకమనీ అంటారు. మోక్షం కోరేవారు పుణ్యకార్యాలుచేయాలి. వాస్తవమే. కానీ ఈ జన్మలోనే సుఖసంతోషాలు అనుభవిస్తున్నదే దానికి కారణం? ఈ ప్రశ్నను వారు తరచిచూడరు.
మనంచూసే వస్తువులకు రంగుఉన్నది. బొమ్మలకూ, బట్టలకూ మనం రంగువేస్తాం. దానినితుడిపి వేరేరంగుకూడా వేయవచ్చు. ఏరంగుగల వస్తువైనా నిప్పులోవేస్తే బొగ్గయి నల్ల నౌతున్నది. అందువల్ల ఈ కనబడే రంగులు సత్యంకాదు. అన్నీ నిప్పులో నల్లబడుతున్నవి. పోనీ ఆనలుపైనా సత్యమా అంటే అదీకాదు. ఇంకా కొంతసేపు అగ్నిలో పుటంవేస్తే భస్మమౌతుంది. అపుడు నలుపు తెలుపౌతుంది. ఆ తెలుపు సత్యం.
అగ్నిలో పుటంవేసినపుడు ఏ వస్తువుయొక్క స్వరూపస్వభావాలు మార్పుచెందవో ఆ వస్తువు సత్యమనీ, తక్కిన దంతా అసత్యమనీ గ్రహించాలి. ఈ భావనకు చిహ్నంగా మనం నదుట భస్మ నలదుకొంటాం.
అగ్నిలో పుటం వేసినట్లుతత్త్వాన్ని పుటంవేసి కారణాలు వెదుకుతూపోతే అన్ని కారణాలకూ కారణమైన పరమకారణం తెలుసుకొంటాం. అదిలేకపోతే సృష్టేలేదు.
సృష్టిలో ఎన్నో మట్టిలో పుట్టి మట్టిలోనే కలసిపోతున్నవి. ఈభావన చిహ్నంగా వైష్ణవుల తిరునామమును-అనగా మట్టిని తిలకంగా ఉపయోగిస్తున్నారు.
బౌద్ధులకు బాహ్యచిహ్నం ఏమీలేకపోయినా చివరకు అంతా శూన్యమనివారు విశ్వశిస్తారు. శూన్యాన్ని తెలుసుకొన్న ప్రతి మానవుడూ ఆపిమ్మట బుద్ధుడౌతాడని అంటారు. వారు భగవంతుడున్నాడని ఒప్పుకోరు. కాని వారికి దేవతలు ఉన్నారు.
ఈవిధంగా పరిశీలిస్తే వైదిక ప్రాతిపదికపై ఆవిర్భవించిన మతాల మౌలిక సూత్రాలు పరస్పర విరుద్ధాలు కావని అర్థమౌతుంది.
ఏ మతస్థులైనా, ఏ సంప్రదాయానికి చెందినా, కామక్రోధాలను అధిగమించడమే మానవుని పరమావధి. ఇందుకు అందరూ సత్కర్మలు చేస్తూ, పరంపరాగతమైన అనుష్ఠానాన్ని ప్రతిరోజూ ఆచరించడానికి పూనుకోవాలి.
మరొక ముఖ్యమైన విషయం. గోగ్రాసానికి అందరూ అవిసె ఆకును పెంచవలసివున్నది. పూర్వంకన్నా ఎక్కువ భూములు ఇపుడు సాగుబడిలోనికి వచ్చినవి. ఆ పంటనంతా మనం అనుభవిస్తున్నాంకదా! గోవులకు కావలసిన పచ్చిక బయళ్ళు కరువైపోయింది. అందుచేత దేవాలయాలలోనూ, ఇతర ఖాళీస్థలాలలోనూ అవిసె ఆకును పెంచవలసి ఉన్నది. ఇది ప్రతిఒక్కరూ చేయవలసిన పని. ఈవిధంగా పెంచే ఆకును ఎవరన్నా దొంగిలించినా ఫరవాలేదు. ఈపనులుచేస్తే, ఆలయాలేకాక భారతదేశ##మే బాగుపడుతుంది.
నేడు దేవాలయాలలో అభిషేకాదులకు కొన్ని చోట్ల పిండిపాలు వాడుతున్నారు. ఒక్కొక్కమారు మిషన్లతో పిండిన పాలుకూడా వాడుతున్నారు. మిషన్లతో పాలును పితికితే, పాలతోబాటు రక్తం స్రవించే ప్రమాదమున్నది. ఈ పద్ధతిలో, స్వామికి, గోక్షీరం బదులు గోమాంసం అర్పించినట్లు ఔతుంది. అందుకని ప్రతిఆలయంలోనూ రెండు గోవులుండుట అవసరం. ఈ గోవులిచ్చే పాలతో అభిషేకం జరిపించండి.
ఆలయావరణలో దేవుని పూజకు కావలసిన పుష్పాలను పెంచండి. అనుదినమూ, పోషణావశ్యకతలేని పొన్న, మల్లె మందారములు నాటండి. ఆవరణలో సగం పూలచెట్లు సగం అవిసెచెట్లు నాటండి.
నేడు స్త్రీలు, కన్యకలు ఋతుధర్మాచారాలను పాటించనందువల్ల ఆలయాలలో దైవాపచారం జరుగుతున్నది. వయస్సు వచ్చిన విద్యార్థినులు, వినోదార్థం పర్యటనలకు పోవునపుడు ఆలయాలకు వస్తున్నారు. వారిలో ఎవరు అపరిశుద్ధంగా వున్నారో తెలియదు. తెలిపినా ప్రవేశము నిరాకరించ వీలులేదు. ఆవిధమైన చట్టమేమీలేదు. ఇలాంటి సందర్భములలో శాస్త్రాన్ని సంప్రదించి శాస్త్రవిహితమైన పరిహారం చేయవలసినదని కోరుకొంటున్నాం. అవసరమైన ప్రతిరోజూ ఈపరిహారం చేయించవలసినదే.
దర్శనానికి వచ్చే జనంవద్ద నుండి ప్రవేశరుసుము ఆలయాలలో వసూలు చేస్తున్నారు. ఈ రుసుము అభిలాషణీయము కాదని తోస్తున్నది. దీనిని రద్దుచేసి, ఆదాయం తగ్గేపక్షంలో, ప్రత్యామ్నాయం ఆలోచించాలనికోరుతున్నాను.
మనమందరమూ, వీరులవలె కార్యరంగంలో దిగితే, వీరభద్రునిఅనుగ్రహంతో లక్ష్మీకటాక్షం తప్పకకలుగుతుంది.
|